EC Notices to KCR over Comments Made in Sirscilla : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం మాజీ ముఖ్యమంత్రిని ఈ నెల 18 ఉదయం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని 2019, 2023లోనూ కేసీఆర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం గుర్తు చేసింది.
పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికల నియమావళిని పాటించాలని ఈసీ కోరింది. నిరాధార ఆరోపణలు, దుర్భాషలు ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని, ఎన్నికల వాతావరణం దెబ్బ తింటుందని ఈసీ తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ నుంచి ఈసీ నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా స్పందించిన కేసీఆర్, తనకు సమయం కావాలని కోరారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కోరారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలి : కేసీఆర్ - KCR Polam Bata Programme
అసలు కేసీఆర్ ఏమన్నారంటే..? పొలం బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్లో పర్యటించిన కేసీఆర్, పంటల పరిశీలన అనంతరం సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీటి నిర్వహణ సామర్థ్యం లేదని, తెలియదని ఎద్దేవా చేశారు. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో సజీవ జలధారలు సృష్టించామన్న కేసీఆర్, గత 8 ఏళ్లు ప్రజలు ఆ ఫలాలను అనుభవించారని పేర్కొన్నారు.