Volunteers campaigning For YSRCP:ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ఉద్యోగులపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటుగా వాలంటీర్లపై ఈసీ కొరడా ఝుళిపించింది.
ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు: ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్న పలువురు వాలంటీర్లు, అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో అధికారపార్టీ అభ్యర్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న 12 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద పనిచేస్తున్న ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాట్సాప్ గ్రూపులో పోస్టులు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ కుందురు అనిల్ కుమార్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారపార్టీకు మద్దతుగా వాలంటీర్ రవి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. బీజేపీ నాయకుడు నాగరాజు ఫిర్యాదుతో అధికారులు అతన్ని విధులు నుంచి తొలగించారు.
ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడ్ ఉల్లంఘనలు- దేవాలయాలనూ వదలని వైసీపీ నేతలు - Volunteers Election Code Violation