contractors attacked Municipal Office : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించటంలేదంటూ 15మంది గుత్తేదార్లు మున్సిపల్ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించిన బిల్లులు అధికారులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంట్రాక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని కాంట్రాక్టర్లు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. గుత్తేదారులకు రెండు కోట్లు బకాయిలు చెల్లించాల్సిన ఉందన్న మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి బిల్లులు పంపించామని తెలిపారు.
కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ - ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
'పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులను ఎంత వేడుకున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నాం అని చెప్తున్నారు. తమపై కూడా ఒత్తిడి ఉందని, బిల్లుల కోసం ఎదురుచూడాలని, అకౌంటెట్లు పని పూర్తి చేయడం లేదని సాకులు చెప్తున్నారు. మరికొంత మంది అధికారులు బిల్లులకు తొందరేముందని అంటున్నారు. అప్పులు తెచ్చి పని చేశాం అని చెప్తుంటే మిమ్మల్ని ఎవరు అప్పు తీసుకురమ్మన్నారని ప్రశ్నిస్తున్నారు. అంత తొందరగా పనులు పూర్తి చేయమని మేం చెప్పామా అని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు అందక పోతే చనిపోతారా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధికారులకు ఒకట్రెండు రోజులు వేతనం ఆలస్యమైతేనే రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటారు. కానీ, మేం అప్పు తెచ్చి ఇంత ఇబ్బందులు పడుతూ ధర్నాలు చేయకూడదా' అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.