Congress Public Meeting in Indravelli Today : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి తొలిసారిగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం ఆవరణ వేదికగా జరిగిన ఆదివాసీ, గిరిజన, దళిత దండోరా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు సీఎం హోదాలో అదే వేదికగా జరిగే తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy Adilabad District Tour Today : హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మధ్యాహ్నం ఒకటిన్నరకు కేస్లాపూర్ చేరుకుంటారు. అక్కడ నాగోబా సన్నిధిలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లిలో అమరులకు నివాళులర్పిస్తారు. స్మృతివనం పనులకు భూమి పూజ చేసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మరో జలియన్‌వాలాబాగ్‌గా ప్రసిద్ధి పొందిన ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్థూపానికి నివాళులర్పించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కావడం విశేషం.
Congress Public Meeting in Indravelli Today :ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అవసరమైన నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి ముత్నూర్ క్రాస్‌రోడ్డు వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి సీఎం నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.