Congress Plans to Public Meeting in Tukkuguda : లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ భారీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రెండంకెల స్థానాలు దక్కించుకోడానికి పక్కా వ్యూహంతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా పార్టీ కార్యకలాపాలకే సమయాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్య నాయకులతో సమావేశమవడం, నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయడం, ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై వ్యూహరచన చేస్తున్నారు.
Congress Focus on Lok Sabha Elections 2024 :ఇప్పటివరకు ప్రకటించిన తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల బలాబలాలపై ఆరా తీయడం, అక్కడ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ : నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా కమిటీల ఏర్పాటు చేయాలని ఆయా డీసీసీ అధ్యక్షులను రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఏఏ అంశాలను జనంలోకి తీసుకెళ్లాలన్న అంశంపైనా ఆయన సీనియర్ నేతలతో చర్చించి కసరత్తు చేస్తున్నారు. కలిసొచ్చిన తుక్కుగూడలో వచ్చే నెల మొదటి వారంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.