Congress on MP Elections 2024 :రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి ప్రజలు ఆ పార్టీని ఓడించారని, అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ అనుభవం ఉన్న దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, తప్పనిసరిగా ఆయన కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లిలో సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా నాంపల్లి పార్టీ ఇన్ఛార్జీ ఫిరోజ్ ఖాన్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.
నియంత పాలనకు బీజేపీ నిదర్శనం :మరోవైపు బీజేపీ నియంత పాలనకు నిదర్శనమే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై కేసు నమోదని మంత్రి సీతక్క ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతును అణిచివేస్తూ నియంతృత్వ పాలన కొనసాగించడమే ఆ పార్టీ లక్ష్యమని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ, బీఆర్ఎస్లు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. మొన్నటి వరకు రైతు బంధు వేయరని దుష్ప్రచారాలు చేసిన పార్టీలు, నేడు రైతు భరోసా నిధులు వేస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మంత్రి సీతక్క ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ తమ పార్టీని ఆదరించాలని కోరారు. కేసులకు భయపడేవారు కాంగ్రెస్‌లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి సుగుణపై గతంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తే 52 కేసులు నమోదు చేశారని సీతక్క తెలిపారు.