Congress Leaders Condolences To Ramoji Rao :ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయంతో ప్రముఖ రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగంలో ఆయన చేసిన ఎనలేని కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఉంచిన ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
దేశంలోని పత్రికా రంగానికి తీరని లోటు : పత్రికలు ప్రచార సాధనాలు కూడా ప్రతిపక్షాలుగా ప్రధాన పాత్ర పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తి పాలకుల నుంచి వాటిని పరిష్కరించడానికి పోరాడిన వ్యక్తి అని పేర్కొన్నారు. రామోజీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాంటి మహనీయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి సత్కరించుకుంటామని వెల్లడించారు. రామోజీరావు మరణం దేశంలోని పత్రికా రంగానికి తీరని లోటు అన్నారు.
"రామోజీరావు దేశ రాజకీయాల్లో, పత్రిక, ప్రసార రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడి పత్రికలు ప్రతిపక్ష సాధనలు పాత్ర పోషిస్తాయని నిరూపించారు. వ్యాపారంలో, ప్రజాసేవలో ప్రజా సమస్యలను లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగేలా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
రామోజీరావు ఒక లెజెండ్ : రామోజీరావు జీవతం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన నడవడిక తెలుగు జాతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించిన తుమ్మల ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు లెజెండ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.