Congress Leaders Comments on Harish Rao Challenge : సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామనటం హర్షించదగ్గ విషయమని, గతంలో ఎద్దేవా చేసిన హరీశ్‌రావు, కేటీఆర్ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన వారు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతగా ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం లేదని జీవన్‌రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వ్యక్తిగత విషయమన్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించటం, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని కొనియాడారు.
Congress Celebration on Rythu Runa Mafi : రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీకి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు పెట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద నిలబడుతుందని వెల్లడించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ సాధించిన ఇంతటి ఘనతను ప్రజల పక్షాన, రైతుల పక్షాన పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులకు మోసం చేసిందని ఆరోపించారు. మరోవైపు రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దాదాపు రూ.31 వేల కోట్లతో రైతు రుణమాఫీని ఏకకాలంలో చెయ్యడం ప్రభుత్వ గొప్ప నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.