CM Revanth Delhi Tour :తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 17వ తేదీన జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు హాజరు కానుండడంతో మరుసటి రోజున మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోపు కేబినెట్ విస్తరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై హైకమాండ్ చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాప్యం అవుతూ వస్తోంది.
నలుగురికి ఛాన్స్! :కేబినెట్లో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులున్నారు. ఇప్పుడు కొత్తగా నలుగురికి అవకాశం దక్కనుందని సమాచారం. ఈ అంశంపై చర్చ జరిగే నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు కూడా ఈనెల 17 సాయంత్రం కానీ, ఈ నెల 18వ తేదీ ఉదయం కానీ దిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల విషయంలో ఎక్కడో ఒకచోట రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీసీ రాజీ పడాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.