Congress Focus on MP Elections in Telangana : గత పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరిలో అనుసరించిన వ్యూహాన్ని ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో అనుసరించాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మూడంచెలుగా సమన్వయ కమిటీలు, బూత్ కమిటీలు అయిదుగురు కీలకమని వెల్లడించారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం పెట్టుకుందని, లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
CM Revanth Focus on MP Elections 2024 :ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకులు అందరూ కార్యకర్తలకు వెన్నంటి ఉండాలన్న ఆయన ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లోనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ(AICC) పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
ఈ ఎన్నికలకు వీరే సైనికులు : ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నందున, నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉంటారని సీఎం రేవంత్ వివరించారు. బూత్ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు అయిదుగురికి అవకాశం కల్పిస్తారని, వారు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడుతారని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్‌లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పని తీరుకు ప్రాతిపదికగా నిలుస్తుందన్నారు.