Congress Candidates Election Campaign in Telangana :లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. దేశంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే, రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి మాట్లాడారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చేసి బడుగు బలహీన వర్గాలను మరీ పేదలుగా మార్చే ఆలోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌లోని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకే 400 సీట్లను బీజేపీ కోరుతోందని భట్టి విమర్శించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలంమధు ప్రచారం చేశారు. దుబ్బాకలో మధుకు మద్దతుగా చేసిన మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్, బీజేపీకు డిపాజిట్లు గల్లంతు చేయాలని ఓటర్లకు సూచించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, వేములవాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు మద్దతుగా ప్రచారం చేసిన మంత్రి శ్రీధర్‌బాబు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీను నిలువరించేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.