Kadapa Municipal Meeting Today : కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి రణరంగమైంది. భేటీకి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ తీరుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్యే వైఎస్సార్సీపీ పాలకవర్గం అజెండా ఆమోదించుకుంది. అజెండా ఆమోదించుకుని సమావేశం వాయిదా వేసి మేయర్ సురేశ్‌బాబు వెళ్లిపోయారు.
మేయర్ తీరుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు.వైఎస్సార్సీపీ పాలనలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మేయర్‌కు చెరోవైపు కుర్చీవేసేవారని, ఎన్నికల్లో కడప, కమలాపురం స్థానాల్లో టీడీపీ గెలవడంతో పద్ధతి మార్చేశారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న తనను అవమానిస్తున్నారని మాధవీరెడ్డి ధ్వజమెత్తారు.
గత సమావేశంలోనూ ఇదే విధంగా ప్రవర్తించిన మేయర్ సురేశ్‌బాబు, ఇప్పుడు కూడా తీరు మార్చుకోకపోవడం దారుణమని మాధవీరెడ్డి విమర్శించారు. కుర్చీ విషయంలో వివక్ష గురించి ప్రశ్నిస్తే అది తన విచక్షణాధికారం అంటూ మేయర్ విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమోనని ఆక్షేపించారు. తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నట్లు ధ్వజమెత్తారు. కడప అభివృద్ధిని కుంటుపరిచారని, ఇక్కడ జరిగిన అవినీతిపై మాట్లాడాలని చెప్పారు. అవినీతిపై చర్చిస్తారనే సమావేశాలు జరగకుండా చేస్తున్నారని మాధవీరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
ఈ నేపథ్యంలోనే మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మధ్య వాదోపవాదాలు సాగాయి. కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే నిలబడ్డారు. మేయర్ కుర్చీకి ఒక వైపు టీడీపీ, మరో వైపు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిల్చొని నిరసన తెలిపారు. మేయర్ కుర్చీ వెనక ఇరుపక్షాల వాదోపవాదనలు సాగాయి. పోటాపోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్‌కు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కింద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ :సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఏడుగురు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ సురేశ్‌బాబు ప్రకటించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. గందరగోళ పరిస్థితుల్లో సమావేశాన్ని మధ్యాహ్నానికి మేయర్ వాయిదా వేశారు.