SANKRANTI RUSH AT TOLL PLAZAS: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు తరలివెళుతున్న వారితో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వేలాదిగా వాహనాలు స్వగ్రామాలకు కదలివెలుతుండటంతో విజయవాడ వైపు వెళ్లే అన్ని టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గంటలకొద్ది ప్రయాణం ఆలస్యం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా వెళ్తున్న ప్రజలతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు అధికారులు అదనపు సర్వీసులను ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు తరలివెలుతున్న వాహనాలతో టోల్ గేట్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న వాహనాలతో చిల్లకల్లు టోల్‌గేట్ రద్దీగా మారింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య 25 వేల వాహనాలు టోల్‌గేట్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు. చిల్లకల్లు టోల్గేట్లో మొత్తం 12 దారులు ఉండగా ఆరు దారులను విజయవాడ వైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా దారుల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. సాయంత్రానికి రద్దీ బాగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనాల రద్దీ నేపథ్యంలో టోల్‌గేట్ వద్ద అదనపు సిబ్బందిని నియమించారు.
స్తంభించిన ట్రాఫిక్: ఎన్టీఆర్ జిల్లా - నందిగామ జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో భారీగా రద్దీ నెలకొంది. వై జంక్షన్ వద్ద హైవేపై వెహికల్ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం దానికి అనుసంధానంగా రోడ్, సర్వీస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల హైదరాబాద్ - విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అదే విధంగా జగ్గయ్యపేట వద్ద చిల్లకల్లు టోల్‌గేట్ రద్దీగా మారింది. మరోవైపు యాదాద్రి పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఆలస్యం అవుతోంది. 12 టోల్ బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వాహనాలను సిబ్బంది పంపిస్తున్నారు. సంక్రాంతికి తరలివచ్చే వాహనాలతో టోల్‌గేట్లు కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పల్లెలకు బయల్దేరిన పట్టణవాసులతో కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.
పల్లె'టూరు'కి జనం - కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు