CM YS Jagan Stone Pelting Case :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కు విజయవాడ కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. శని, ఆది వారాలు అజిత్‌సింగ్ నగర్ పీఎస్‌లో సంతకాలు చేయాలని ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా నిందితుడు సతీష్ ఉన్నాడు.
ఇదీ నేపథ్యం :మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ డాబాకొట్ల సెంటర్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో జగన్‌కు స్వల్పగాయమైంది. జగన్ బస్సు యాత్ర విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని గంగారం గుడి సెంటర్ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్ మోహన్ రెడ్డికి తగిలింది. ఆ తరువాత పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కు రాయి తాకింది.
ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎడమ కనురెప్ప పై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు సతీష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Stone Attack on CM Jagan :కాగా సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడిని ఏప్రిల్ 18వ తేదీన అరెస్టు చేసినట్లు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ను నిందితుడిగా తేల్చారు. అయితే ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్‌పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.