CM Revanth Speech at Narayanapet Jana Jathara Sabha :పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10శాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్(KCR) పదేళ్ల పాలనలో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను బీసీ-డీ కేటగిరి నుంచి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు.
నారాయణపేటలో నిర్వహించిన ‘కాంగ్రెస్ జనజాతర సభ’కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరోవైపు మాదిగల వర్గీకరణ(Madigala Classification) చేయాల్సిందేనని, వాళ్లకు న్యాయం జరగాల్సిందేని రేవంత్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. నారాయణపేట మున్సిపాలిటీకి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ :కేసీఆర్ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారన్న రేవంత్‌రెడ్డి, పాలమూరు బిడ్డ, పేదోడి బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దొరలు మాత్రమే కుర్చీల్లో కూర్చోవాలా, పేద బిడ్డలు కూర్చోవద్దా అంటూ ఆయన నిలదీశారు. జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్, గులాబీ పార్టీని మోదీకి తాకట్టుపెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద ఉంచారన్న ఆయన, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెబుతున్నారని దుయ్యబట్టారు. వందరోజులకే తనని గద్దె దించాలని కేసీఆర్ అంటున్నారు. కానీ పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీని(PM Modi) గద్దె దించాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం, ఎన్నికల కోడ్ ఉన్నందునే రుణమాఫీ చేయలేకపోయామన్నారు. వచ్చేసారి వడ్లకు రూ.500 బోనస్ తప్పకుండా ఇస్తామని ప్రకటించారు.