CM Revanth Review on Bhuvanagiri Lok Sabha Constituency : భువనగిరి పార్లమెంట్‌లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జనగామ అసెంబ్లీ ఇంఛార్జీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వకర్తలు పాల్గొన్నారు.
కొడంగల్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కుట్ర - నాపై కక్షగట్టి దుష్ప్రచారం : సీఎం రేవంత్
ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీన చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ జన సమీకరణతో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజున సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నామినేషన్ కార్యక్రమంతో పాటు బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. మే మొదటి వారంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, చౌట్‌ప్పల్ రెండు చోట్ల నిర్వహించనున్న భారీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలవనున్నట్లు పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి, భువనగిరిలో మెజార్టీ 2 లక్షలకు తక్కువ కాకుండా చామల కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భువనగిరిలో అభ్యర్థి చామల గెలుపు బాధ్యత రాజగోపాల్ రెడ్డిదేనని సీఎం అన్నారు.