CM Revanth Reddy Video Message On New Govt Schemes :రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 4 పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు. ఈ వీడియో సందేశాన్ని గ్రామ సభల్లో అధికారులు ప్రదర్శించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి :రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం సందేశాన్ని ప్రదర్శించారు. రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వరికి బోనస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500కు సిలిండర్ వంటి కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి వీడియో సందేశంలో వివరించారు.