CM Revanth Sensational Comments On Harish Rao : దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ట్రాప్‌లో పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని జోస్యం చెప్పారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీశ్ ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబునాయుడు కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదని స్పష్టం చేశారు.
ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం:ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నెగెటివా? పాజిటివా? అన్నది కాదన్న సీఎం, ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కారణంగానే హైదరాబాద్ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్లాయని, దాని వల్లే మల్కాజిగిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం కలిగిందని రేవంత్ అంచనా వేశారు.
శాసనసభ ఎన్నికలు కేసీఆర్‌ను దించాలి? తనను గెలిపించాలి? అన్న అంశంపైనే జరిగాయని రేవంత్ అన్నారు. పదేళ్లు ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడింది తానే కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా తనను ఎంచుకున్నారని రేవంత్ తెలిపారు. పాలనలో తన మార్కు ముద్ర వేయడమే లక్ష్యమని వివరించారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీకి మనుగడ ఉంటుందని సీఎం వెల్లడించారు.
CM Revanth Chitchat Comments on KCR :చంద్రబాబు నాయుడు ముందు జగన్ ఎంత అని ప్రశ్నించిన రేవంత్, అయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారని గుర్తు చేశారు. వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకొని పోరాడారని, కోర్ ఏరియాను చంద్రబాబు వదల్లేదని అన్నారు. ఇక్కడ కేసీఆర్ ఆ పని చేయడం లేదని, హరీశ్‌రావు ఆ పని చేయించడం లేదని విమర్శించారు.
కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే మూడ్‌లో లేరని ఆరోపించిన రేవంత్, ఆయన ఇప్పుడు హరీశ్ ట్రాప్‌లో ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కానీ, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదని స్పష్టం చేశారు. ఈరోజు భావోద్వేగాలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి, అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీ బతుకుతుందని సూచించారు.
కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయే : పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు తప్ప, హరీశ్ కాదని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ ఖతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీశ్‌రావేనని ఆరోపించారు. ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించింది హరీశేనని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయేననీ, మీడియానే ఆయన్ను పెద్దగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లు తామే వేసుకొని ఉంటే కాంగ్రెస్ 12 సీట్లు సులభంగా గెలిచేదని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి డబ్బులు పంచి మరీ బీజేపీకి ఓట్లేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకున్న సీట్లలో కాంగ్రెస్ గెలిచిందనీ, ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన చోట్ల కమలం పార్టీ వికసించిందని వివరించారు.
కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు :మరోవైపు రాష్ట్రంలో కమలం పార్టీ నిర్మాణం లేదన్న సీఎం, కేసీఆర్ బీఆర్ఎస్ను విలీనం చేస్తే తప్ప ఆ పార్టీకి బలం ఉండదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తెలుస్తుందని, తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరుంటారనేది కమలం, గులాబీ పార్టీల పని తీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు 151 సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారన్న సీఎం రేవంత్, అధికారంలోకి వచ్చాక జగన్ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్నారని, కానీ ఆయనే తుడిచి పెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.
నా మార్కు పాలనే లక్ష్యం : సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో, మనకో పనికొస్తాయని, టీడీపీకి పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్లు 10 శాతం ఓట్లు దక్కించుకొనేవారని అంచనా వేశారు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే, చేసే ఏ ఒక్క పనీ పూర్తి చేయలేనని, అన్నీ స్తంభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.