CM Revanth Participate in Nomination Rally :ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ లోక్‌సభ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన సీఎం, మోదీ, కేసీఆర్, మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు.
హస్తం పార్టీపై చెయ్యి వేస్తే మాడి మసైపోతారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు పథకాలు చూసి కేసీఆర్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. పిట్టల దొరలా మారి, కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదలకు ఎప్పుడూ అండగా నిలబడేది మూడు రంగుల జెండానేనని, కాంగ్రెస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని రేవంత్ కోరారు.
"కాంగ్రెస్ హామీల అమలు చూసి ఓర్వలేని కేసీఆర్, హరీశ్‌రావు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మెదక్ వేదికగా తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15వ తేదీ లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. మా ప్రభుత్వానిది. అంతేకాదు వచ్చేసారి పండించే వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించామని తెలిపారు. పేదోడికి సొంత ఇల్లు ఉంటే గౌరవంగా జీవిస్తారని, ఆ దిశగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి, ఇచ్చే ఇళ్లను రద్దు చేయాలని దిల్లీలో ఉండే మోదీ, గజ్వేల్‌లో ఉండే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పేదవాడి కళ్లలో ఆనందం చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. వచ్చే వరి పంటను రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత తనదేనని పునరుద్ఘాటించారు.