CM Revanth Reddy MP Election Camapaign : రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని అడుగుతుందని ఆరోపించారు. గాంధీభవన్‌కు దిల్లీ పోలీసులను పంపించారని తెలిపారు. తనను అరెస్టు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించారన్నారు.
గుజరాత్ పెత్తనమా లేక తెలంగాణ పౌరుషమా : గుజరాత్ పెత్తనమా లేక తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. దిల్లీ పోలీసులను కాదు, సరిహద్దు సైనికులను తెచ్చుకున్నా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీతో మాజీ సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శలు చేశారు. ఎన్నికలయ్యాక బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్కు ఒక్క ఓటు వేసినా అది వృథానేనని అన్నారు. కారు కార్ఖానాకు పోయింది, జబారులో తూకానికి అమ్మాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ను చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.