CM Revanth Reddy Comments on DSC Exam : రాష్ట్రంలో 11 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, ఎన్నో ఏళ్లుగా జరగని డీఎస్సీని కొందరు అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని ఆక్షేపించారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్ చేస్తున్నారన్న ఆయన, ఆ డిమాండ్ వెనక ప్రతిపక్ష కుట్ర ఉందని ఆరోపించారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలిస్తే మళ్లీ కోర్టుకు వెళ్తారని, నోటిఫికేషన్‌లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని కోర్టు మళ్లీ రద్దు చేస్తుందని తెలిపారు. పదే పదే పరీక్షలను రద్దు చేయించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా భూత్పూర్‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ వ్యాపారం కోసం పరీక్షలు వాయిదా వేయాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు తనను కలిశారని తెలిపారు. కేవలం వాళ్ల వ్యాపారం కోసమే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షల వాయిదా కోరుతున్నారన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఎందుకు కూర్చోవటం లేదని సీఎం ప్రశ్నించారు. నిరాహార దీక్షల్లో పేద విద్యార్థులు, పేద నేతలు మాత్రమే ఎందుకు కూర్చుంటున్నారన్న ఆయన, పరీక్షల వాయిదా కోసం కేటీఆర్, హరీశ్‌రావు దీక్షకు కూర్చోవాలని సవాల్ విసిరారు. ఆ ఇద్దరు ఆర్ట్స్ కాలేజీ ముందు దీక్షకు కూర్చుంటే రక్షణ కల్పిస్తామన్నారు.
డీఎస్సీ పరీక్షలు యథాతథం - ఈ నెల 11న హాల్‌టికెట్లు విడుదల : విద్యాశాఖ - TG DSC As Per Schedule