CM Revanth Jana Jatara Sabha in Dharmapuri :2021లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జనాభా లెక్కలు చేయకపోవడంలో ఆంతర్యమేంటని, కులగణన ఎందుకు చేయలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. రిజర్వేషన్ల రద్దు కోసమే కులగణనలో జాప్యం వహించారన్న సీఎం, పార్లమెంట్‌లో కమలం పార్టీకి మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి, సిరిసిల్ల జనజాతర సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి వెలిచాల రాజేశ్వర్‌రావుకు మద్దతుగా ఆయా ప్రచారసభల్లో ప్రసంగించారు.
రాష్ట్రంపై బీజేపీది సవతి తల్లి ప్రేమ : కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్‌కు తరలించుకుపోయిందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్న ఆయన, ఈసారి కాషాయ పార్టీకి ఓటేస్తే రాజ్యాంగమే ప్రమాదంలో పడుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తేనే రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేసారు.
బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డ సీఎం, మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పదేళ్లు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజనచట్టంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేశారన్నారు. కాజీపేటకు ఇచ్చిన రైల్వే కోచ్ కర్మాగారాన్ని లాతూర్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు.
"గుజరాత్‌కు మాత్రం బుల్లెట్ రైలు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల నిధులు తరలించుకు పోయారు. గుజరాత్‌లో ఉన్నవారేనా? తెలంగాణలో ఉన్న వాళ్లు మనుషులు కాదా? ఈ రాష్ట్రంపై బీజేపీ నేతలు, దేశ ప్రధాని సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
PCC Chief Revanth Fires on BJP :కులగణన చేపట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్న సీఎం, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్రచేస్తోందని ఆరోపించారు. అందుకే 400 సీట్లు కావాలంటోందని, గెలిస్తే లోక్‌సభలో మూడో వంతు మెజార్టీతో రిజర్వేషన్లు రద్దు చేస్తారని వ్యాఖ్యానించారు.