తెలంగాణ

telangana

ETV Bharat / politics

భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం - రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం - CM REVANTH ON BHU BHARATHI

రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి - ధరణి వల్ల రైతులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధలు పడ్డారన్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On Dharani Portal
CM Revanth Reddy On Dharani Portal (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2024, 4:20 PM IST

Updated : Dec 20, 2024, 5:04 PM IST

CM Revanth Reddy On Dharani Portal :రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 'భూ భారతి' బిల్లుపై అసెంబ్లీలో చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రావి నారాయణ, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారన్నారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని సీఎం అన్నారు.

భూమిని కాపాడుకునే క్రమంలోనే దొడ్డి కొమురయ్య లాంటివారు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారన్నారు. పేదల భూములను రక్షించేందుకే పటేల్​ పట్వారీ వ్యవస్థను గతంలో రద్దు చేశారన్నారు. భూమిలేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

సన్నిహితులకే ధరణి పోర్టల్​ అప్పగించారు :విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. స్పీకర్​ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్​ రైతులను తమ భూములకు దూరం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. ఒడిశా సర్కారే తప్పు చేసిందని ఎన్​ఐసీ, కాగ్​ సూచిందన్న ఆయన అనుభవం లేని ఐఎల్​ అండ్​ ఎఫ్​ఎస్​ సంస్థకు అప్పగించవద్దని హెచ్చరించిందన్నారు. యువరాజుకు అత్యంత సన్నిహితులైన వారికి ధరణి పోర్టల్​ను అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈవోగా గాదే శ్రీధర్‌రాజు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

విలువైన సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో :50 లక్షల రైతుల వివరాలు, భూమి వివరాలను ఓ సంస్థ చేతిలో పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టెరాసిస్‌ చేతిలో పెట్టిన ధరణి పోర్టల్‌ పది సంస్థల చేతులు మారిందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మన ధరణి పోర్టల్‌ ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, కెమెన్‌ ఐలాండ్స్, వర్జిన్‌ ఐలాండ్‌ మీదుగా తిరిగిందన్నారు. ఈ పోర్టల్​ను నిర్వహించిన వాళ్లెవరూ భారతీయులు కాదన్న రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక నేరాలకు పేరొందిన దేశాలు, సంస్థల చేతుల్లో మన రైతుల వివరాలు పెట్టారని మండిపడ్డారు. ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కేసీఆర్‌ను శిక్షించాలన్నారు.

ముందుగా జాగ్రత్త పడటం వల్ల రూ.450 కోట్లు మిగిలాయి :మరోవైపు ఫార్ములా- ఈ కార్‌ రేసింగ్‌ అంశంపై కూడా సీఎం రేవంత్ స్పందించారు. ఫార్ములా- ఈ కార్‌ రేసింగ్‌ ప్రతినిధులు వచ్చి తనను కూడా కలిశారని తెలిపారు. రూ.600 కోట్ల పెండింగ్‌ నిధులు రావాల్సి ఉంది ఇవ్వమని అడిగారని వెల్లడించారు. మీరు ఊ అంటే మరోసారి ఈ కార్​ రేసింగ్​ నిర్వహిస్తామని నిర్వాహకులు తన వద్దకు వచ్చారని తెలిపారు. ఈ కార్​ రేసింగ్​ గురించి సభలో చర్చించాలని కేటీఆర్​ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

ఈ కార్​ రేసింగ్​పై ఏసీబీ విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేనని రేవంత్ రెడ్డి తెలిపారు. హెచ్​ఎండీఏ ఖాతాలోని కోట్ల నిధులు నేరుగా లండన్​లోని కంపెనీకి ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. రేసింగ్‌ నిర్వాహకులతో కేటీఆర్‌ కుదుర్చుకున్నది రూ.600 కోట్ల ఒప్పందం అని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగతా డబ్బుల కోసం వాళ్లు వచ్చినప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చినందున జాగ్రత్త పడటంతో హెచ్ఎండీఏకు రూ.450 కోట్లు మిగిలాయి అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Last Updated : Dec 20, 2024, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details