CM Revanth Reddy Fire On Modi :కేసీఆర్, మోదీ పదేళ్లు అధికారంలో ఉన్నారని, అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. డిసెంబర్ 3న కారును షెడ్డు పంపించారని, షెడ్డుకు పోయిన కారు తుప్పుపట్టి పోయిందని ఎద్దేవా చేశారు. అది ఇక రాదని, కారు తుప్పుపట్టి పోయినందుకే బస్సు వేసుకుని బయలుదేరారని అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు కేసీఆర్ వైఖరి ఉందని, ఆయన పదేళ్ల పాటు ఎప్పుడైనా ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వచ్చారా అని ప్రశ్నించారు.
పదేళ్లలో ఎప్పుడైనా కేసీఆర్ బయటికి వచ్చి, రైతులతో మాట్లాడారా ? పంటలను పరిశీలించారా ? అని సీఎం రేవంత్ మండిపడ్డారు. నాలుగు గంటలు టీవీలో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వచ్చి ఎందుకు సమాధానాలు చెప్పలేదని ప్రశ్నించారు. రైతుల ఆదాయం పెంచుతానన్న మోదీ, వారికి ఖర్చులు పెంచారని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతుల ప్రాణాలు బలి తీసుకున్నారని మండిపడ్డారు. అందరూ జన్‌ధన్ ఖాతాలు తెరవండని, అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ అన్నారని, ఈ పదేళ్లలో ఎవరి ఖాతాలోనైనా ఆయన రూ.15 లక్షలు వేశారా అని ప్రశ్నించారు.
CM Revanth on RSS and BJP : రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చిన వాటిని కూడా మోదీ సర్కార్ రద్దు చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 400 సీట్లు వస్తే, రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో మూడొంతుల మెజార్టీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేయటమే ఆ పార్టీ అజెండా అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాలు, అజెండానే మోదీ సర్కారు అమలు చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్ అజెండాలో ఉందని, దాన్ని అమలు చేయడమే బీజేపీ లక్ష్యమని ఉద్ఘాటించారు.