CM Revanth Reddy Campaign in Other States : కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించటమే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే ఐదు గ్యారంటీలతో పాటు సబ్బండ వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చేట్లు రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టింది. మరోవైపు ఆయా రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి ప్రచారం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024 : ఈ నేపథ్యంలోనే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటకలో అధికార పగ్గాలు చేపట్టిన ఆ పార్టీ అదే స్ఫూర్తితో పనిచేసేలా నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Campaign 2024) చరిష్మాను తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 50కి పైగా బహిరంగ సభలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుండగా రేవంత్‌రెడ్డి ప్రచారబరిలోకి దిగనున్నారు.
అదే విధంగా, తెలంగాణ పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల పరిధిలోని ప్రాంతాల్లోనూ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్ భారీగా పెరిగింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరుకాగా విశేష స్పందన లభించింది.
రేవంత్‌రెడ్డిని క్రేజ్‌ను ఇతర రాష్ట్రాల్లో వాడుకునేలా : ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి క్రేజ్‌ను ఇతర రాష్రాల్లోనూ వాడుకునేలా కాంగ్రెస్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో హస్తం పార్టీ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఇవాళ మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో పర్యటన రద్దైంది.