CM Revanth Delhi Tour Details :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఆదివారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం దిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వీరిద్దరితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి రోహిత్ చౌదరిలు దిల్లీ వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే 13 నియోజకవర్గాలకు అభ్యర్థల ప్రకటన పూర్తి కాగా, మిగిలిన 4 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునేందుకు స్క్రీనింగ్ కమిటీ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో సమావేశమై కసరత్తు చేసింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యులను సంప్రదించి, ఏకాభిప్రాయం తీసుకొచ్చే పనిని చేశారు. స్థానిక నాయకులతో పాటు ముఖ్యులను కూడా కలిసి హరీశ్ చౌదరి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఇవాళ్టి కేంద్ర సీఈసీ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ నివేదికతో పాటు సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వే నివేదికలు కూడా నివేదిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మిగిలిన నాలుగు స్థానాలపై వీడని పీఠముడి : ఈ నెల 27న దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైన కాంగ్రెస్ సీఈసీ, రాష్ట్రంలో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై చిక్కుముడి పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం కోసం అయితే పోటీ విపరీతంగా ఉంది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల ఫ్యామిలీ మెంబర్స్, కీలక నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఆయన వియ్యంకుడు రఘురామిరెడ్డి పోటీలో ఉన్నారు.