CM Jagan Changes YSRCP Regional Coordinators : ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల పేరుతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్ లేదని కరాఖండిగా చెప్పింది. ఆ పార్టీ ప్రకటించిన ఆరు జాబితాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కీలక నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షులు ప్రాంతీయ సమన్వయకర్తల్లో మార్పులు చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేసిన, చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి పేరు లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆయన స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది. కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా అదే చెవిరెడ్డి కోసం విజయ సాయి రెడ్డిని పార్టీకి దూరంగా పెట్టిందని సమాచారం. ఈ పరిణామాలు చూస్తుంటే బాలినేనికి ఎదురైన పరాభవమే సాయిరెడ్డికి ఎదురవుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయం-బాలినేనికి అధిష్టానం షాక్?
వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు, తిరుపతిలను ఆయన వద్ద నుంచి తీసేశారు. ఈ రెండు జిల్లాల బాధ్యతలను ఇప్పటికే ఒంగోలు జిల్లా సమన్వయకర్తగా ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అదనంగా అప్పగించారు. విజయసాయిరెడ్డి నుంచి ఈ మధ్యనే ప్రకాశం జిల్లా బాధ్యతలు చెవిరెడ్డికి అప్పగించారు.