ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు మోదీ: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU SPEECH

మోదీ రాకతో రూ.2.08 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్న సీఎం చంద్రబాబు - కూటమి కాంబినేషన్‌ భవిష్యత్తులోనూ ఉంటుందని వ్యాఖ్య

Chandrababu Speech
Chandrababu Speech (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 6:39 PM IST

Updated : Jan 8, 2025, 7:33 PM IST

CM Chandrababu Speech in Visakha Public Meeting: మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.08 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖ వాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్‌, నక్కపల్లిలో బల్క్ డ్రగ్‌ పార్కు వస్తోందని తెలిపారు. రూ.2.08 లక్షల కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు: ముందుగా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్న పవన్‌ కల్యాణ్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సాహం, అభిమానం చూపిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ రోడ్‌ షో బ్రహ్మాండంగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు మోదీ అని సీఎం కొనియాడారు.

ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఈసారి మనం గెలిచామని, ఇదే కాంబినేషన్‌ భవిష్యత్తులోనూ ఉంటుందని స్పష్టం చేశారు. దిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని, రాసిపెట్టుకోండంటూ ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు అని అన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకిన్ ఇండియా తెచ్చారని గుర్తు చేశారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, గతిశక్తి పథకాలు తెచ్చారని తెలిపారు.

దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది: రైతులకు అండగా ఉండేందుకు పీఎం ఫసల్ బీమా యోజన కొనసాగిస్తున్నారని, సూర్యఘర్‌, కుసుమ్‌ ద్వారా సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మోదీ కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని, 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో ఉంటామని అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న సీఎం, కేంద్రం సాయంతో నిలదొక్కుకున్నామని, ముందుకెళ్తున్నామని చెప్పారు.

మోదీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నా: సూపర్‌సిక్స్‌ హామీలన్నీ అమలుచేసే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. కేంద్రం అండతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని, రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ మారడం ఖాయమని స్పష్టం చేశారు. అరకు కాఫీని మోదీ బాగా ప్రచారం చేస్తున్నారని, ఆయనని స్ఫూర్తిగా తీసుకుని నిత్యం ముందుకెళ్తానని తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని కోరుతున్నామని చెప్పారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, కేంద్రం సాయం కావాలని కోరారు.

సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారు:ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటనే పనులు జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని అన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా చొరవ చూపించలేదని కొనియాడారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. మనదేశానికి సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని ప్రశంసించారు. మోదీ సారథ్యంలో భారత్‌ ప్రగతిని ప్రపంచమంతా గమనిస్తోందని గుర్తు చేశారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉంటేనే లక్ష్యాలు చేరుకోగలమన్న సీఎం, విధ్వంసాలు చేసే పార్టీలను దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

పేదల చిరునవ్వు, మహిళల ఆశాదీపం 'నమో': నారా లోకేశ్

మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు - 7.5 లక్షల మందికి ఉపాధి: పవన్

Last Updated : Jan 8, 2025, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details