ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ తిరిగి రావాలి - నూతన పారిశ్రామిక విధానంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం - CM review on New Industrial Policy

CM Chandrababu Review on New Industrial Policy: పరిశ్రమల స్థాపనలో ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ తిరిగి వచ్చేలా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దేశంలోని అగ్రస్థాయి 5 రాష్ట్రాలతో పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. 100 రోజుల్లోగా అన్ని పారిశ్రామిక విధానాలు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

CM_Chandrababu_Review_on_New_Industrial_Policy
CM_Chandrababu_Review_on_New_Industrial_Policy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 8:53 AM IST

CM Chandrababu Review on New Industrial Policy:నూతన పారిశ్రామిక విధానంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలోని టాప్‌-5 రాష్ట్రాలతో పోటీపడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్‌ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. 15 శాతానికిపైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.

త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామికాభివృద్ధివిధానం 2024-29పై రూపొందించిన ముసాయిదాను మంత్రి టీజీ భరత్‌, అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. 2014-19 కాలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిస్థానంలో ఉండేదని గుర్తు చేశారు.

పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు చంద్రబాబు వ్యూహం- అధికారులకు స్పష్టమైన ఆదేశాలు - CM Chandrababu vision

మళ్లీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 53 శాతం ముడిసరకులు రాష్ట్రం నుంచి వెళ్తున్నాయన్న సీఎం వాటికి ఏవిధంగా వాల్యూ ఎడిషన్‌ ఇవ్వాలో చూడాలని సూచించారు. పీపీపీ, పీ-4 పద్ధతులను నూతన విధానంలో పొందుపర్చాలని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటవుతాయని సీఎం అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రానికీ లేనట్లుగా 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్‌ సదుపాయాలు ఏపీలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని సీఎం అన్నారు. ఇవి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. నదుల అనుసంధానం కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలాంశమన్నారు. వేగంగా, తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమవచ్చినా దానిని ఏపీకి తీసుకొచ్చేలా అందరూ పనిచేయాలని ఆదేశించారు. గతంలో కర్ణాటకకు తరలివెళ్లిన హీరో మోటార్స్‌, తెలంగాణకు వెళ్లిపోయిన అపోలో టైర్స్‌ వంటి సంస్థలను ఏపీకి తిరిగి తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అధికారులకు గుర్తు చేశారు. గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన జరగాలని నిర్దేశించారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నట్లు అధికారులకు తెలిపారు. ఈ నెల 23న మరోసారి సమావేశమై నూతన పారిశ్రామిక విధానంపై చర్చిద్దామని అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు - తిరిగొస్తున్న ఇండస్ట్రియల్ దిగ్గజాలు - Industries for Andhra Pradesh

ABOUT THE AUTHOR

...view details