CM Chandrababu Review on Industrial Development:రాష్ట్రంలో 'ఎంప్లాయిమెంట్ ఫస్ట్' అన్నదే ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా, "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"కు మార్గం సుగమం చేసేలా కొత్త పాలసీల ఉంటాయని చెప్పారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా నూతన పాలసీలు ఉండాలన్నారు. సీఎం సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా 7, 8 శాఖలపై అధికారులు ఇప్పటికే ముసాయిదాలు సిద్ధం చేశారు.
ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అదనపు రాయితీ:ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్న సీఎం సూచనల మేరకు పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ గవర్నమెంటుగా నిలిచేలా విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలను వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులతో వచ్చే మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు 10 శాతం అదనపు రాయితీ ఇవ్వనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సీఎం చెప్పారు.