ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరణ: సీఎం చంద్రబాబు - CHANDRABABU REVIEW ON BC WELFARE

బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష - బీసీ విద్యార్థుల డైట్ బకాయిలు చెల్లించాలని ఆదేశం

Chandrababu_Review_on_BC_Welfare
Chandrababu_Review_on_BC_Welfare (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 8:53 PM IST

CM Chandrababu Review on BC Welfare Department: బీసీలను హత్య చేసిన వారిపై విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని, అవసరమైతే ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయంలో బీసీ సంక్షేమశాఖపై సమీక్షించిన సీఎం వివిధ అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో 13 కాపు భవనాలను మంజూరు చేసిందని అందులో 5 భవనాల నిర్మాణాలను ప్రారంభించామని మిగిలిన వాటిని గత ప్రభుత్వం నిలిపేసిందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. అవి త్వరలోనే వినియోగంలోకి రానున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణంలో ఉన్న 42 కాపు కమ్యూనిటీ హాళ్లు కూడా వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని 660 గవర్నమెంట్ హాస్టల్స్‌లో 13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

బిల్లులు చెల్లించాలని ఆదేశం: విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ అందించలేదని, 18 కోట్లతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా ఈ ప్రక్రియ మార్చి 3వ వారం నాటికి పూర్తవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ట్యూటర్ల గౌరవ వేతనానికి సంబంధించి 485 హాస్టళ్లలో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన 2.02 కోట్ల బకాయిలు, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న 2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి 4.35 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు.

భవిష్యత్తులో మరో చెల్లిపై ఇలాంటి ఘటనలు జరగకూడదు: మంత్రి లోకేశ్​

డైట్ ఛార్జీలకు సంబంధించి 185.27 కోట్లు పెండింగులో ఉన్నట్టు గుర్తించిన సీఎం ప్రస్తుతం అందులో 110.52 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. కాస్మోటిక్ బిల్లులు 29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అలాగే హాస్టళ్ల విద్యుత్ సరఫరాకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సూచించారు. సత్యసాయి జిల్లాలోని నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరణ: బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లోనూ ఆమోదం తెలిపామని, ఈ మేరకు అవసరమైతే న్యాయపోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రతి కార్పొరేషన్‌కు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై ఇప్పటికే విధివిధానాలు రూపొందించామని తెలిపారు.

రజకులకు మేలు చేకూరేలా రాష్ట్రంలో 2014-19 మధ్య నిర్మించిన దోబీ ఘాట్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. బడ్జెట్‌లో కేటాయించే నిధులతో రాష్ట్రంలో బీసీ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2014 నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందిన వారి సమాచారాన్ని సేకరించాలని, వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ప్రస్తుతం ఎంతమంది కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు: సీఎస్‌ విజయానంద్‌

బడ్జెట్​లో మా శాఖపై కనికరం చూపండి! పయ్యావుల పేషీకి క్యూ కట్టిన మంత్రులు

ABOUT THE AUTHOR

...view details