CM Chandrababu on Law and Order: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్దంగా లేనని తేల్చిచెప్పారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్థులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదని మండిపడ్డారు.
హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపా: కేసులు పెట్టడానికి వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని దుయ్యబట్టారు. ఆదివారం ఒక్క రోజే 5 వేల అర్జీలు వచ్చాయని, వచ్చిన వాటిల్లో 50 శాతం భూ సమస్యల పైనే ఉన్నాయన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అశాంతి ఉందన్న చంద్రబాబు, మదనపల్లె ఫైల్స్ ఘటన ఓ కేస్ స్టడీ అని తెలిపారు. మదనపల్లె ఘటన జరిగితే హెలీకాప్టర్ ఇచ్చి డీజీపీని, సీఐడీ చీఫ్‌ను పంపానన్నారు. 22-A పేరుతో భూ సమస్యలు సృష్టించారని, కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పు చేసి భూములను కాజేశారని మండిపడ్డారు.
షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో సీసీ కెమెరాలు పెట్టాలి: సీఎం చంద్రబాబు - Chandrababu on CCTV Cameras
గొడ్డలి పోటు హత్యను గుండెపోటుగా మార్చారు: భూమి ఉంటే సామాన్యునికి ఓ భరోసా అని వ్యాఖ్యానించారు. దాన్ని కబ్జా చేయడంతో ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని మండిపడ్డారు. భూ బాగోతాలను ఎస్టాబ్లిష్ చేయాలి, పేదలకు న్యాయం చేయాలని ఆదేశించారు. నేరాలను చేయడం, వాటిని కప్పి పుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందన్నారు. వివేకా హత్యను గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చారని చంద్రబాబు ఆక్షేపించారు. వివేకా హత్యపై ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ కావాలని, అధికారంలోకి రాగానే సీబీఐ అవసరం లేదన్నారని దుయ్యబట్టారు.
యాక్షన్ ప్లాన్ రూపొందించాలి:తప్పు వాళ్లు చేసి నారాసుర రక్త చరిత్ర అంటూ తన మీద ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 36 మందిని రాజకీయ హత్యలు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నానన్నారు. ఐదేళ్లల్లో చేసిన తప్పును వెలికి తీసి శిక్షిస్తామని, ఇప్పుడు ఎవరు తప్పులు చేసినా ఊరుకోనన్నారు. గంజాయి సేవించి ఆడవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, దీన్ని కంట్రోల్ చేయాలన్నారు. ప్రజలు గత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారని, వాళ్లకు ప్రశాంత జీవితం ఇవ్వాలన్నారు. శాంతి భధ్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
అప్పట్లో ఐఏఎస్‌లను డ్రైన్లలోకి దింపాను - ఆకస్మిక తనిఖీలకు వస్తా సిద్ధంగా ఉండాలి: చంద్రబాబు - Chandrababu Review with Collectors
హాట్‌స్పాట్‌లపై దృష్టిపెట్టాలి: తాను రౌడీయిజం చూశానని, నక్సలిజం చూశానని, ఫ్యాక్షనిజం చూశానని, తనకేం భయం లేదని స్పష్టంచేశారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. ఉత్పత్తి చేస్తున్న, విక్రయిస్తున్న హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని పోలీసులకు ఆదేశిస్తునన్నారు. చిన్న సంఘటననూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామన్నారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ తెస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని, జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తేవాలన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయన్న చంద్రబాబు, 1.17 లక్షల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరపాలని వివరించారు. కొంత మేర ఆర్దిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నట్లు సీఎం తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, ఇన్ విజుబుల్ పోలీస్ అనే విధానం ఉండాలన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం - చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పవన్ కల్యాణ్ - Pawan on Collectors Conference