CM Chandrababu Focus on Mining Irregularities : గత ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2014-19 మధ్య మైనింగ్ శాఖ ఆదాయంలో 24 శాతం వృద్ధి సాధిస్తే, 2019-24 మధ్య 7 శాతానికి పడిపోయిందని అధికారులు వివరించారు. అస్తవ్యస్థ విధానాలు, అక్రమాల వల్ల ప్రభుత్వం రూ.9వేల 750 కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు. ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపైనా సీఎం ఆరా తీశారు.
ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి 1,025 కోట్ల రూపాయలు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఉచిత ఇసుక విధానానికికూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తవ్వకం, సీనరేజ్, రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చనేదే తమ విధానమన్నారు. రవాణా ఖర్చుల వల్ల కొన్ని చోట్ల అనుకున్నంత తక్కువ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా సీఎం చర్చించారు. వినియోగదారులకు భారం కాకుండా చూడాల్సిందేనని స్పష్టం చేశారు.
మైనింగ్ అక్రమాల సూత్రదారి - రిటైర్మెంట్ ప్లాన్‌తో వీర'భద్రం' - Mines Department osd Retirement
గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఇసుక పాలసీ అమలుపై ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం ఇసుక నుంచి ఎలాంటి ఆదాయం ఆశించడంలేదని, అక్రమాలు జరగకుండా వినియోగదారులకు ఇసుక లభించేలా అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.
పట్టాల్యాండ్స్‌లో సీనరేజ్ కట్టి అమ్ముకునే అవకాశం కల్పిద్దామన్న అధికారుల సూచనలకు సీఎం ఆమోదం తెలిపారు. కొన్నిచోట్ల టన్ను 150 రూపాయలకే లభిస్తున్నా కొన్ని చోట్ల స్టాక్ పాయింట్ల వద్ద అంతే ధరకు లభించడంలేదని దూరప్రాంతాల నుంచి రవాణా చేయడం వల్లే ఈ సమస్య ఉందని అధికారులు తెలిపారు. నేరుగా రీచ్‌ల నుంచే వినియోగదారుడికి ఇసుక చేర్చే విధానాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుత సీజన్లో కొరత లేకున్నా ధర విషయంలో అక్కడక్కడా ఉన్న ఇబ్బందులు పరిష్కారం కావాలని సీఎం అన్నారు. రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.
ఏపీఎమ్డీసీ ద్వారా ఈ ఏడాది అదనంగా 500 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల ద్వారా విలువ ఎలా జోడించవచ్చు అన్న అంశపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఏపీలో లభించే ఖనిజాలను మెరుగుపరిచే పరిశ్రమలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సిలికా, క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలపై ఇప్పటివరకు జరిపిన విచారణ వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. అనుమతి లేని కొన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపినట్లు గుర్తించామని చెప్పారు. వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సేకరించాలని సీఎం సూచించారు.
వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా దోచుకున్నారు - విచారణ తరువాత చర్యలు తప్పవు: మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Ravindra on Illegal Mining