Rammohan on Vijayawada Airport : దేశంలో విమానయాన రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ హయంలో పదేళ్లలో 57 విమానాశ్రయాలు నిర్మించారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో నూతనంగా 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా : ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ-దిల్లీ ఇండిగో సర్వీసును రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు గన్నవరం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఆగస్టులో ఈ విమానశ్రయం నుంచి 85,000ల మంది ప్రయాణించారని చెప్పారు. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు పెరిగిందని పేర్కొన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని ఆయన వివరించారు.
ఇందులో భాగంగానే 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసు, అక్టోబర్ 27న విశాఖ- దిల్లీకి సర్వీసును ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని దుబాయ్, సింగపూర్‌కు విస్తరించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, మైసూరు ఎంపీ యధువీర్, తదితరులు పాల్గొన్నారు.