Mallela Rajesh met CM YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. సీఎంవో నుంచి పిలుపు రావడంతో చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే విడుదల రజినికి గుంటూరు వెస్ట్ టికెట్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నూతన ఇన్ఛార్జిగా మల్లెల రాజేశ్ నాయుడును నియమించి, ఆ తర్వాత కొద్దిరోజులకే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవలే చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును నియమించింది. ఈ క్రమంలో మల్లెల రాజేశ్ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. పైగా తాను రూ.6.5 కోట్లు రజినీకి ఇచ్చానని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయంలో సజ్జల జోక్యం చేసుకుని రూ.3 కోట్లు తిరిగి ఇప్పించారని తెలిపారు.
'సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు'
ఎమ్మెల్యే సీటు కోసం మంత్రి విడదల రజినికి రూ.6 కోట్లు ఇచ్చినట్లు మల్లెల రాజేశ్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు ఫిర్యాదు చేస్తే రూ.3 కోట్లు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగిలిన డబ్బు ఇవ్వాలని మంత్రి రజినిని కోరితే, దిక్కున్నచోట చెప్పుకోమన్నారని రాజేశ్ ఆరోపించారు. మల్లెల రాజేశ్ ఆరోపణలు సంచలనం రేకెత్తించడంతో ఈ వ్యవహారంపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. మల్లెల రాజేశ్‌ను సీఎంవోకు పిలిపించి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడారు. అనంతరం సీఎంతో సమావేశమైన మల్లెల రాజేశ్, మంత్రి విడదల రజిని డబ్బు వసూలు చేసిన వ్యవహారంపై జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సీఎంకు ఆధారాలు కూడా అందించినట్లు తెలిసింది. పంచాయితీ దృష్ట్యా నరసారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సైతం సీఎంవోకు చేరుకున్నారు.