తెలంగాణ

telangana

ETV Bharat / politics

'అమ్మకాలు పెరిగినప్పటికీ మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు' - CM Revanth Review On Income Sources

CM Revanth Review On Income Sources : రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వాణిజ్య పన్నులు, రవాణా, ఎక్సైజ్​, రిజిస్ట్రేషన్లు, గనుల నుంచి వచ్చే ఆదాయ మార్గాలపై అధికారులతో సీఎం రేవంత్​ రెడ్డి చర్చించారు.

CM Revanth Review On Income Sources
CM Revanth Review On Income Sources (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 10:09 PM IST

Updated : May 16, 2024, 10:57 PM IST

CM Revanth Review On Income Sources :రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. వాణిజ్య పన్నులు, రవాణా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, గనుల శాఖల నుంచి వచ్చే ఆదాయంపై అధికారులతో చర్చించారు. ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో పని చేయాలని.. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. నెలవారీ లక్ష్యాలను పెట్టుకొని బడ్జెట్ లో అంచనాలకు అనుగుణంగా రాబడులను సాధించాలని సీఎం తెలిపారు. జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తనిఖీలు, ఆడిటింగ్ చేసి జీఎస్టీ వసూళ్లు పెంచాలని సూచించారు.

జీఎస్టీ ఎగవేస్తే ఎంతటివారైనా ఉపేక్షించవద్దని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని.. జీఎస్టీ రిటర్న్సులో అవినీతి అక్రమాలు జరగడానికి వీల్లేదని సీఎం హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ.. దానికి అనుగుణంగా ఆదాయం ఎందుకు పెరగలేదని సీఎం ఆరా తీశారు. మద్యం అక్రమ రవాణ, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఇసుక ద్వారా ఆదాయం పెరగాలంటే.. అక్రమ రవాణ, లీకేజీలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం హడావుడిలో ఉన్న ముఖ్యమంత్రి, రెండు రోజులుగా పాలనపై దృష్టి సారించారు. వివిధ రంగాల్లో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆగస్ట్ 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ మాట నిలుపుకునేందుకు కావల్సిన ఆదాయ మార్గాలపై ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇవాళ సచివాలయంలో వాణిజ్య పన్నులు, రవాణా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, గనుల శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష - ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ

నీటిపారుదల రంగంపై సర్కార్ ఫోకస్ - నేడు సీఎం రేవంత్ సమీక్ష

Last Updated : May 16, 2024, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details