Chandrababu Pawan Kalyan Delhi Tour: బీజేపీతో పొత్తులపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu Naidu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah), బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పొత్తులపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీతో (BJP) పొత్తుకి సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్‌షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి సమావేశం అయ్యారు.
బుధవారం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశం జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీలైనంత త్వరగా అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు - పవన్ కల్యాణ్ కీలక చర్చలు జరిపారు.
మరోవైపు టీడీపీ - జనసేన కూటమిలో (TDP - Janasena Alliance) బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన సమావేశంలో దిల్లీ పరిణామాలపైనా ఇరువురు అధినేతలు మధ్య కీలక చర్చ జరిగింది. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చలు సాగాయి. ఈ నేపథ్యంలోనే నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్తున్నారు.