Attack on Chandrababu house Case Updates:జగన్ సర్కార్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేశ్ తన అనుచరుల్ని ఉసిగొల్పిన తీరుపై ప్రత్యక్ష సాక్షి వాస్తవాలు బయటపెట్టారు. దాడి చేస్తున్న సమయంలో అక్కడున్న టీడీపీ కార్యకర్తల్లో ఒక్కరి తల తీసేస్తే చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేశ్ తన అనుచరులను ఉసిగొల్పారని ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్‌రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై 2021 సెప్టెంబరు 17న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటపై కేసు నమోదైంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షి, ఉండవల్లికి చెందిన తమ్మా శంకరరెడ్డి నుంచి బుధవారం పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు.
DIG: చంద్రబాబు ఇంటికి జోగి రమేశ్ అందుకే వెళ్లారు: డీఐజీ
అనంతరం మీడియాతో మాట్లాడిన తమ్మా శంకరరెడ్డి.. ఉండవల్లికి చెందిన తమ స్నేహితులంతా దాడి ఘటన జరిగిన రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 1.30 గంటల సమయంలో హఠాత్తుగా ఐదారు కార్లలో జోగి రమేశ్, ఆయన అనుచరులు వచ్చారన్నారు. కర్రలతో వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు. ఏదో గొడవ జరుగుతోందని వెళ్లగా వైఎస్సార్సీపీ నేతలు తమను కూడా కొట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వీళ్లలో ఒక్కడి తలైనా తీసేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేశ్ బిగ్గరగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
"చంద్రబాబు నాయుడిని తరిమేద్దాం.. వీళ్లలో ఒక్కడిదైనా తల తీసి చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారు. ఇక ఏపీకి రారు అని జోగి రమేశ్ బిగ్గరగా అరిచారు. మనకేంటి డీజీపీ ఉన్నారంటూ మూకలను రెచ్చగొట్టారు. బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్, నేను, నా స్నేహితులు.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ను ఎంతో వారించాం. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా ఇళ్ల మీదకు రావడం తప్పని చెప్పాం. అయినా వినకుండా కర్రలతో మా తలలపై కొట్టారు. నాతోపాటు జంగాల సాంబశివరావు, గాదె శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాపై దాడికి పాల్పడటమే కాకుండా తిరిగి మాపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ పిలిస్తే వచ్చి ఈ రోజు వాంగ్మూలం ఇచ్చాం." - తమ్మా శంకరరెడ్డి, ప్రత్యక్ష సాక్షి
'చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో త్వరగా విచారణ జరపండి'