TOP TEN NONVEG STATES LIST IN INDIA : తెలంగాణలో మాంసాహారం లేకుండా పండుగలు, వివాహాది శుభకార్యాలు జరగవనేది నిజమే. ఏపీతో పోలిస్తే అక్కడ నాన్ వెజ్ వాడకం ఎక్కువని ప్రచారం ఉన్నమాట వాస్తవమే. కానీ, అదంతా అపోహే అని తేలిపోయింది. అంచనాలు తలకిందులయ్యాయి. నాన్ వెజ్ వాడకంలో తెలంగాణతో పోలిస్తే ఏపీ ముందంజలో ఉందని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వెల్లడించింది.
వారాంతమైనా, వేడుకైనా, పండుగైనా నాన్ వెజ్ కామనై పోయింది. అంతేకాకుండా వారంలో రెండు, మూడు రోజులు మాంసాహారం సర్వసాధారణంగా మారిపోయింది. బిర్యానీ, తందూరీ, ఫ్రై, పులావ్ ఇలా ఎన్నో రకాలుగా మాంసాహార వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే (NHFS-5) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా నాన్ వెజ్ తినడంలో టాప్ 10 రాష్ట్రాల జాబితా వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం మాంసాహార వినియోగంలో తెలంగాణ ఏడో స్థానంలో నిలవడం గమనార్హం. కేరళ తర్వాత ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, ఏ రాష్ట్రం ఏ స్థానం దక్కించుకుందో వివరాలు చూద్దామా?!
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
నాగాలాండ్ : దేశంలో అత్యధికంగా మాంసాహారం తీసుకోవడంలో నాగాలాండ్ రాష్ట్ర ప్రజలు ముందున్నారు. రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు మాంసాహార ప్రియులే. 99.8% ప్రజలు నాన్ వెజ్ తింటారని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా మాంసం వినియోగంలో నాగాలాండ్ టాపర్‌గా నిలిచింది.
పశ్చిమ బెంగాల్ : మాంసాహార వినియోగంలో నాగాలాండ్ తదుపరి స్థానం పశ్చిమ బెంగాల్. ఇక్కడ 99.3 శాతం ప్రజలు నాన్ వెజ్ తీసుకుంటారని వెల్లడిస్తూ రెండో స్థానం కట్టబెట్టింది. సహజంగా బెంగాళీలు చేపలు అధికంగా తినడం తెలిసిందే.
కేరళ : నాన్ వెజ్ వాడకంలో కేరళ తొలి మూడో స్థానం ఆక్రమించింది. రాష్ట్రానికి సముద్ర తీర రేఖ అధికంగా ఉండడంతో సీఫుడ్ విరివిగా దొరుకుతుంది. 99.1 శాతం మంది మళయాళీలు మాంసాహారం ఆరగిస్తారని నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే తేల్చింది.
ఆంధ్రప్రదేశ్ : నాన్ వెజ్ వాడకంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ చికెన్, మటన్, చేపలతోపాటు మాంసాహారం తినేవారు 98.25 శాతం మంది ఉన్నారట. తీర ప్రాంతాల్లో చేపలు, రొయ్యలు దండిగా లభించడం తెలిసిందే.
తమిళనాడు : నేషనల్ హెల్త్ ఫ్యామిలీ చేపట్టిన నాన్ వెజ్ వాడకం సర్వేలో టాప్ 5లో తమిళ ప్రజలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97.65 శాతం మంది నాన్ వెజ్ లాగించేస్తారట. చికెన్, మటన్‌తో పాటు అధికంగా దొరికే సీఫుడ్ ఇష్టంగా తినేస్తారు.
ఒడిశా : దాదాపు 97.35 శాతం ఒరియా ప్రజలు మాంసాహారం తీసుకుంటారట. తీరప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా జలచరాలను ఆహారంలో తింటారు. ఇందులో రొయ్యలు అంటే వీరికి ఎంతో ఇష్టమట.
తెలంగాణ : తెలుగు రాష్ట్రమైన తెలంగాణ మాంసాహార వినియోగంలో అందరి అంచనాలను తలకిందులు చేసింది. జనాభాలో 97.4 శాతం మంది మాంసాహార ప్రియులతో దేశ వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ మటన్, చికెన్ తినేవాళ్ల సంఖ్య ఎక్కువ. సముద్ర తీరం లేకపోవడంతో సీఫుడ్ లభ్యత తక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
జార్ఖండ్ : రాష్ట్ర ప్రజల్లో 97 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. ఇక్కడి మెజారిటీ నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ఎక్కువ ఇష్టమైన వంటకం అని తెలిసింది. సర్వేలో జార్ఖండ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
త్రిపుర : మరో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 95 శాతం మంది మాంసాహారం భుజిస్తున్నారట. ఎక్కువగా ఫిష్, పోర్క్, చికెన్ తీసుకుంటారని సర్వే వెల్లడించింది.
గోవా : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవా దేశ వ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. గోవా ప్రజల్లో 93.8 శాతం మంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా చేపలు, పీతలు వంటి సీఫుడ్స్ తీసుకుంటారు.
అద్దిరిపోయే "రొయ్యల పులావ్" - ఇలా చేస్తే ఇంట్లో వాళ్లకి పండగే!