Bandi Sanjay Counter on KTR Letter : సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తనకు రాసిన లేఖపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది మీరే కదా? సిరిసిల్లకు 15 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహించారు కదా? ఎందుకు నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించలేకపోయారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి కదా అని బండి సంజయ్ నిలదీశారు. బతుకమ్మ బకాయిలు చెల్లించకుండా పవర్ లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది మీరే కదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్‌ను ప్రకటించినప్పుడు, మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా అన్నారు. సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, కరీంనగర్ ఎంపీగా అది తన బాధ్యత అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
'కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరం'- సీఎం రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ - Minister Bandi Letter to CM Revanth
కేటీఆర్ బహిరంగ లేఖ : సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత పదేళ్లుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని, ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారని, అయినా నేతన్నలకు ప్రతిసారి నిరాశే ఎదురైందని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకొచ్చేందుకు గత పదేళ్లుగా తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని కేటీఆర్ ఆక్షేపించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేక మందిని స్వయంగా కలిసినా దక్కింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో సహకారం అందించాలని కోరినా, బండి సంజయ్ పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. రెండోసారి ఎంపీ కావటం, కేంద్రంలో మంత్రిగా కూడా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు సరైన సమయమని గుర్తించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్‌ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.
'మీకు ఇదే సరైన సమయమని గుర్తించండి' - కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లేఖ - KTR Letter to Bandi Sanjay