తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలు - ప్రధానితో కలిసి ప్రమాణస్వీకారం చేసేది వీళ్లే? - TWO UNION MINISTRIES TO TDP - TWO UNION MINISTRIES TO TDP

Two Cabinet Ministries To TDP : కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Central Ministry To Ram Mohan Naidu
Central Cabinet Ministers To Ram Mohan Naidu and Pemmasani Chandra Sekhar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 10:26 AM IST

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌ పెమ్మసాని ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం (ETV Bharat)

Central Cabinet Ministers To Ram Mohan Naidu and Pemmasani Chandra Sekhar? :కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు చంద్రబాబు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

రామ్మోహన్‌నాయుడు :కేంద్ర మాజీమంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్‌ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర క్యాబినెట్‌ బెర్తు ఖరారు చేశారు.

కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి 4 స్థానాలు!- జనసేనకూ అవకాశం? - TDP join UNION CABINET

సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా టీడీపీకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిస్తున్న చంద్రబాబు ఈ ప్రాంతం తమకెంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో టీడీపీ చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. 2014లో ఎన్డీయే సర్కారులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజును ఎంపిక చేశారు. ఇప్పుడు రామ్మోహన్‌నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై టీడీపీకున్న మక్కువను మరోసారి ప్రకటించినట్లయింది.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో కింజరాపు రామ్మోహన్‌ నాయుడు జన్మించారు. అతని వయసు 36 సంవత్సరాలు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. రామ్మోహన్‌ తల్లిదండ్రుల పేరు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు కాగా భార్య పేరు శ్రావ్య. నిహిరఅన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు.

ఎంపీగా గెలిచి పట్టు నిలబెట్టుకుని :2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమిపాలయినా తాను మాత్రం ఎంపీగా గెలిచి, పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్‌ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో 'కింగ్ మేకర్ ఈజ్ బ్యాక్' - దిల్లీ రాజకీయాల్లో కీలకంగా చంద్రబాబు - lok sabha Kingmaker Chandrababu 2024

పెమ్మసాని చంద్రశేఖర్‌ : ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్రమంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. క్యాబినెట్‌ ఎంపికలో తొలుత 10 స్థానాల కన్నా ఎక్కువచోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, ఈ నేపథ్యంలో టీడీపీకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మరో 2 మంత్రి పదవులు వస్తాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్‌ జన్మించారు. ఇతని వయసు 47 సంవత్సరాలు కాగా ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. పెమ్మసాని తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు కాగా భార్య పేరు డాక్టర్‌ శ్రీరత్న. ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు.

అమెరికాలో ఉచిత శిక్షణ :పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అమెరికాలో లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో 'కింగ్ మేకర్ ఈజ్ బ్యాక్' - దిల్లీ రాజకీయాల్లో కీలకంగా చంద్రబాబు - lok sabha Kingmaker Chandrababu 2024

ABOUT THE AUTHOR

...view details