Police Cases against media persons : "పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే" రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పత్రికా స్వేచ్ఛ కూడా రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో పత్రికలది అత్యంత కీలక పాత్ర. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమే. కానీ రాష్ట్రంలో మాత్రం పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతోంది.
విశాఖలో వైసీపీ నేత దాడి ఘటనలో- బాధితుల మీడియా సమావేశం - YCP Attack A Family in Visakha
ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరం అవుతుందా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శతృత్వం పెంచడం ఎల్ అవుతుంది? ఇది నేరపూరిత కుట్రగదా పరిగణించాలా? బాధితుల ఆవేదనను ఛానెళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా? బర్మా కాలనీకి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. వారి ఆవేదనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులపై, వారితో కలిసి మీడియాతో మాట్లాడినందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు C.R.P.C. 91 సెక్షన్ల కింద నోటీసులిచ్చారు.
ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనపై మొత్తం రీ ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసును విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పరిధిలోకి ఈ కేసును తీసుకురావాలని కోరుతున్నాయి. కంచరపాలెం పోలీసులు తమను లంచం అడిగారని బాధితులు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీనిపై విశాఖపట్నం పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? ఈ అంశంపై కూడా దర్యాప్తు చేయాలని, దీన్ని సిట్ పరిధిలోకి తీసుకురావాలని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపై విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.