CM CBN ON Budmeru Gandi Works Completion: బుడమేరు మూడవ గండి పుడ్చివేత పనులు పూర్తి అయ్యాయి. మూడవ గండి కూడా పూడ్చడంతో ముంపు ప్రాంతానికి అతిపెద్ద ఉపశమనం లభించనట్లైంది. గండి పూడ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రులు, అధికారులు తీసుకువచ్చారు. భారీ వరద ఉన్న సమయంలో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
CM CBN High Level Teleconference: మరోవైపు 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూట కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టంచేశారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పని చేయాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు గండ్లు పూడ్చివేయడంతో విజయవాడలోకి నీళ్లు రావని, భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.
రేపు సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు. బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోందని, పంపిణీ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. వరద ప్రభావం వల్ల 6వ డివిజన్లో నిత్యవసర సరుకులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నారని, వారికి కూడా సరుకుల కిట్‌ను అందించాలన్నారు. ఇళ్లల్లో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు, దీనికి అనుగుణంగా అధికారులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన సహాయం అందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్ తరువాత విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ముఖ్యమంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.