BRS Target on Parliament Elections 2024 :ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని దిల్లీ మేనేజ్మెంట్ కోటాలో(Delhi Management Quota) సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉపాధిలేక రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే కేటీఆర్(MLA KTR) డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా జరిగిన గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. తమ అధినేత కేసీఆర్ అధికారంలో కన్నా విపక్షంలో ఉండడమే చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆరఎస్‌ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయన్న కేటీఆర్, అది ఎప్పటికీ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, దిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో అక్కడకు వెళ్లి సీఎం పదవి తెచ్చుకున్నారు. తప్పా ప్రజలంతా ఎన్నుకుంటే వచ్చింది కాదు. గులాబీ అధినేత కేసీఆర్ అధికారంలో కన్నా విపక్షంలో ఉంటేనే చాలా ప్రమాదం. ఎందుకంటే అద్భుతంగా ప్రజల పక్షాన చీల్చిచెండాలగలిగిన పటిమ ఉన్నోడు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు బహుషా దేశంలోనే ఎక్కడా లేదు.-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు పూటకో అంశాన్ని తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చేసిన మంచిపని ప్రజల్లోకి వెళ్లలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారాలతోనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.