BRS Nalgonda Meeting Today :"కాలు విరిగినా కట్టె పట్టుకుని నల్గొండకు వచ్చాను. ఇది రాజకీయ సభ కాదు - ఉద్యమ సభ, పోరాట సభ" అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించిందని చెబుతున్న బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శంఖారావం పూరించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసనగా నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ(BRS Nalgonda Public Meeting)లో పాల్గొన్న కేసీఆర్, కృష్ణా జలాలు పరిరక్షించుకునేందుకు అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వచ్చానని తెలిపారు. తన కాలు సహకరించకపోవడంతో కుర్చీలో కూర్చొనే ప్రసంగించారు.
KCR Speech At Nalgonda Meeting 2024 :కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇదని కేసీఆర్ అన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని 24 ఏళ్లుగా పక్షిలాగ తిరగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని తెలిపారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయని, బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాకే నల్గొండలో ఫ్లోరైడ్ (Nalgonda Fluoride Issue) సమస్య పోయిందని వెల్లడించారు. ఇప్పుడు నల్గొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారిందని వివరించారు.
కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
"కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించాను. నా పాలనలో ఎవరికీ ఏమీ తక్కువ చేయలేదు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడివరకైనా పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఫలితం లేకపాయే అని నేనే పాట రాశాను. బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యింది, డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి."- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది తానని, తెలంగాణ కోసం ఏదైనా అడిగే గర్జు, హక్కు తనకుంది అని కేసీఆర్(KCR at Nalgonda BRS Meeting) అన్నారు. 'మళ్లీ మనమే వస్తాం.. అనుకున్నవి చేస్తాం' అని వ్యాఖ్యానించారు. కరెంటు కోసం ఎక్కడికక్కడ నిలదీయాలని, చలో నల్గొండతోనే ఆపమని రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎక్కడికక్కడ నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం బాధ్యత తమకు ఇచ్చారన్న కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారు తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.