BRS MP Ramulu Joined BJP : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు(BRS MP Ramulu) బీజేపీలో చేరారు. దిల్లీలో ఇవాళ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాములు చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరనుందని రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా గులాబీ పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చర్లపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి, ప్రొఫెసర్ బానోత్ రమణ నాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ కండువా కప్పి ఆహ్వానించారు.