BRS MLA Harish Rao on Pending Salaries of NHM Employees :జాతీయ ఆరోగ్య మిషన్ - ఎన్హెచ్ఎం ఉద్యోగులకు తక్షణమే మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao Says Cong Govt Fails Tp Pay Salaries :అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులకు వేతనాలు అందడం లేదని హరీశ్ రావు తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆక్షేపించారు.