KTR Tweet on Haryana and Jammu Kashmir Election Results : 2029లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండు మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఉండబోతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హర్యానా, జమ్ము-కశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇవాళ్టి ఎన్నికల ఫలితాల నుంచి కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అనిపిస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలు తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.
దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలం ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలతో కర్ణాటకలో, పది హామీలతో హిమాచల్ ప్రదేశ్‌లో, ఆరు గ్యారంటీలతో తెలంగాణలో ప్రజలను మోసగించిందని ఆరోపించారు. కానీ హర్యానా ప్రజలు అవి అబద్ధపు ప్రచారమని గ్రహించారని కేటీఆర్ వివరించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం వినాశకానికి దారి తీస్తోందని కాంగ్రెస్‌కు అర్థమై ఉంటుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్ అంటే ఇలాంటి ఫలితాలే : కాంగ్రెస్‌తో హోరాహోరీగా ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని, ఆ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ బలహీనమైన నాయకత్వం కూడా ఓ ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్న విషయం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను చూస్తే అర్థమవుతోందని తెలిపారు. ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమితోనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. బుల్డోజర్ రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాలకు హర్యానా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.