KTR Tweet On Villages and Towns Situation : పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయన్న ఆయన, ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయిని అన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని, దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పెండింగ్ బిల్లులు అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు :పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా, ప్రజాపాలన అంటే అని కేటీఆర్ అడిగారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు ప్రతినెలా ఠంచన్‌గా 275 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ఇపుడు పెండింగ్ బిల్లులు అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నారని ఆక్షేపించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు.
ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారని మాజీ మంత్రి ప్రశ్నించారు. 12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4305 కోట్లని అంచనా ఉందని, వాటి పరిస్థితి ఏమిటని అడిగారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమన్న ఆయన, కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే, పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు.