KTR Comments on CM Revanth Reddy : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రూ.8,888 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభకోణం ప్రారంభమైందని అన్నారు. బావమరిది, తమ్ముళ్లకు అమృతం, ప్రజలకు విషం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని ఆవేదన చెందారు. అమృత్ టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మరోసారి ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
'సీఎం బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీ శోధాకు ఎలాంటి అర్హతలు లేవు. ఐహెచ్పీ కంపెనీ ద్వారా టెండర్ వేయించారు. కేవలం 20 శాతం మాత్రమే చేస్తామని ఐహెచ్పీ లేఖ రాసింది. 80 శాతం సీఎం బావమరిది చేస్తారట. ఐహెచ్పీని శిఖండిలా వాడుకొని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి అక్రమాలకు తెర లేపారు. 1982 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7,11,13 ప్రకారం సీఎం, ప్రజాప్రతినిధులు తన కుటుంబ సభ్యుల కోసం ఆశ్రిత పక్షపాతం చూపుతూ అధికార దుర్వినియోగం చేస్తే ప్రాసిక్యూట్ చేయవచ్చని చెబుతోంది. ఈ చట్టం ప్రకారం గతంలో సోనియా గాంధీ పదవులు కూడా కోల్పోయారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఇదే పరిస్థితి వచ్చిందని, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా రాజీనామాలు చేశారు.' అని కేటీఆర్ తెలిపారు.
బావమరిది కళ్లల్లో ఆనందం, ఇళ్లలో లంకె బిందెల కోసం రేవంత్ రెడ్డి ఐహెచ్పీని అడ్డం పెట్టుకొని అవినీతికి తెర లేపారని కేటీఆర్ విమర్శించారు. అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేదని, ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కాంగ్రెస్తో కుమ్మక్కు కాకపోతే కేంద్రం టెండర్లు రద్దు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు బయటపెడుతున్నామని కేంద్రం మౌనంగా ఉంటే రేవంత్ రెడ్డితో పూర్తి అవగాహన ఉన్నట్లేనని స్పష్టం చేశారు.